శ్రీ కాళహస్తీశ్వర శతకము – Sri Kalahastiswara Satakam

|శార్దూలము|

శ్రీ విద్యుత్కవితాజవంజన మహా జీమూత పాపాంబుధా

రా వేగంబున మన్మనోబ్జ సముదీర్ణత్వంబు గోల్పోయితిన్

దేవా ! మీ కరుణా శరత్సమయమింతే చాలు, చిద్భావనా

సేవం దామరతంపరై మనియెదన్ శ్రీ కాళహస్తీశ్వరా ! 1

 

|శార్దూలము|

వాణీవల్లభ దుర్లభంబగు భవద్వారంబు నన్నల్చి, ని

ర్వాణశ్రీ చెఱపట్ట చూచిన విచారద్రోహమో, నిత్య క

ళ్యాణ క్రీడలబాసి, దుర్దశలపాలై, రాజలోకాధమ

శ్రేణీ ద్వారము దూరజేసి దిపుడో శ్రీ కాళహస్తీశ్వరా ! 2

 

|శార్దూలము|

అంతా మిథ్య తలంచి చూచిన, నరుడట్లౌ టెరింగిన్, సదా

కాంత, ల్పుత్రులు, నర్థమున్, తనువు నిక్కంబంచు మోహార్ణవ

భ్రాంతిఁ జెంది చరించుఁ గాని; పరమార్థంబైన నీ యందుఁ దా

జింతాకంతయుఁ జింత నిల్పడుఁ గదా శ్రీ కాళ హస్తీశ్వరా ! 3

 

|శార్దూలము|

నీ నాసం దొడబాటుమాట వినుమా నీచేత జీతంబు నే

గానింబట్టక, సంతతంబు మరివేడ్కన్గొల్తు, సంతస్సప

త్నానీకంబున కొప్పగింపకుము న న్నాపాటియే చాలు, తే

జీ నొల్లం గరినొల్ల నొల్ల సిరులన్ శ్రీ కాళహస్తీశ్వరా ! 4

 

|శార్దూలము|

భవకేళీ మదిరామదంబున మహా పాపాత్ముడై వీడు న

న్ను వివేకింపడటంచు, నేను నరకార్ణోరాశి పాలైన బ

ట్టవు, బాలుం డొకచోట నాటతమి తోడ న్నూతగూలంగ దం

డ్రి విచారింపక యుండునా ? కటకటా ! శ్రీకాళహస్తీశ్వరా ! 5

 

|శార్దూలము|

ఏ వేదంబుఁ బఠించె లూత, భుజంగమే శాస్త్రముల్చూచెఁ, దా

నే విద్యాభ్యసనం బొనర్చెఁ గరి, చెంచే మంత్ర మూహించె, బో

ధా విర్భావ నిదానముల్ చదువులయ్యా? కావు ! మీ పాద సం

సేవాసక్తియె కాక జంతు తతికిన్ శ్రీ కాళ హస్తీశ్వరా ! 13

 

|మత్తేభము|

ఒక పూఁటించుక కూడు తక్కువగునే నోర్వంగఁలేఁ, డెండ కో

పక నీడ న్వెదకున్, చలిం జడిసి కుంపట్లెత్తికోఁజూచు, వా

నకు నిండ్లిండ్లును దూఱు నీ తనువు, దీనన్వచ్చు సౌఖ్యంబు రో

సి కడాసింపరుగాక మర్త్యులకటా ! శ్రీ కాళహస్తీశ్వరా! 79

 

|శార్దూలము|

కాయల్గాచె వధూనఖాగ్రములచేఁ గాయంబు, వక్షోజముల్

రాయన్ రాపడె రొమ్ము, మన్మథ విహార క్లేశ విభ్రాంతిచేఁ

బ్రాయంబాయెను, బట్ట కట్టెఁ దల, చెప్పన్ రోఁత సంసార మేఁ

జేయంజాల విరక్తుఁ జేయఁగదవే శ్రీ కాళహస్తీశ్వరా! 115

 

|శార్దూలము|

కాలద్వార కవాట బంధనము, దుష్కాల ప్రయాణ క్రియా

లీలా జాలక చిత్రగుప్త ముఖ వల్మీకోగ్ర జిహ్వాద్భుత

వ్యాళ వ్యాళ విరోధి, మృత్యు ముఖ దంష్ట్రాహార్య వజ్రంబు, ది

క్చేలాలంకృత నీదు నామ మరయన్ శ్రీ కాళహస్తీశ్వరా! 96

 

|శార్దూలము|

నిన్నున్ నమ్మిన రీతి నమ్మనొరులన్, నీకన్న నాకెన్న లే

రన్నల్దమ్ములు, తల్లిదండ్రులు, గురుం, డాపత్సహాయుండు నా

యన్నా ! యెన్నడు నన్ను సంస్మృతి విషాదాంబోధి దాటించి య

చ్ఛిన్నానంద సుఖాబ్ధిఁ దేల్చెదొ కదే శ్రీ కాళ హస్తీశ్వరా ! 23

 

|మత్తేభము|

జలకంబుల్ రసము, లప్రసూనములు వాచాబంధము, ల్వాద్యము

లల శబ్దధ్వను, లంచితాంబర మలంకారంబు, దీప్తల్ మెఱుం

గులు, నైవేద్యము మాధురీమహిమగాఁ గొల్తున్నినుం భక్తిరం

జిల దివ్యార్చన గూర్చి నేర్చిన క్రియన్ శ్రీ కాళహస్తీశ్వరా! 49

 

|మత్తేభము|

తనువెందాక ధరిత్రి నుండు నను నందాక న్మహారోగ దీ

పన దుఃఖాదులఁ బొందకుండ ననుకంపాదృష్టి వీక్షించి, యా

వెనుక న్నీ పద పద్మముల్గొలుచుచు న్విశ్వ ప్రపంచంబుఁ బా

సిన చిత్తంబున నుండఁజేయగదవే శ్రీ కాళ హస్తీశ్వరా ! 47

 

|మత్తేభము|

తరగల్, పిప్పల పత్రముల్, మెరుగుటద్దంబుల్, మరుద్దీపముల్,

కరికర్ణాంతము, లెండమావుల తతుల్, ఖద్యోత కీట ప్రభల్,

సురవీథీ లిఖితాక్షరంబు, లసువుల్, జ్యోత్స్నా పయఃపిండముల్

సిరు, లందేల మదాంధులౌదురు జనుల్, శ్రీ కాళహస్తీశ్వరా! 22

 

|మత్తేభము|

పదునాల్గేలె మహాయుగంబులొక భూపాలుండు, చెల్లించె న

య్యుదయాస్తాచల సంధి నాజ్ఞ నొకఁడాయుష్మంతుఁడై, వీరియ

భ్యుదయం బెవ్వరు చెప్పఁగా వినరొ, యల్పుల్మత్తులై యేల చ

చ్చెదరో రాజులమంచు నక్కటకటా శ్రీ కాళహస్తీశ్వరా! 37

 

|శార్దూలము|

నీకున్ మాంసము వాంఛయేని కఱవా నీ చేత లేడుండఁగా,

జోకైనట్టి కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండఁగా,

బాకంబొప్ప ఘటించి, చేతి పునుకన్ భక్షింప కా బోయచేఁ

జేకొం టెంగిలి మాంస మిట్లు దగునా శ్రీ కాళహస్తీశ్వరా! 19

 

|మత్తేభము|

పుడమి న్నిన్నొక బిల్వ పత్త్రమున నేఁ బూజించి పుణ్యంబునుం

బడయన్; నేరక పెక్కు దైవంబులకుం బప్పుల్, ప్రసాదంబులుం,

గుడుముల్, దోసెలు, సారె సత్తు, లటుకుల్, గుగ్గిళ్ళునుం బెట్టుచుం

జెడి యెందుం గొఱగాక పోదు రకటా శ్రీ కాళహస్తీశ్వరా! 83

 

|మత్తేభము|

మును నేఁ బుట్టిన పుట్టులెన్ని గలవో ? మోహంబుచే నందుఁ జే

సిన కర్మంబుల ప్రోవులెన్ని గలవో ? చింతించినంగాన నీ

జననంబేయని యున్న వాడ, నిదియే చాలింపవే నిన్నుఁ గొ

ల్చిన పుణ్యంబునకుం గృపారతుడవై శ్రీ కాళ హస్తీశ్వరా ! 46

 

|శార్దూలము|

సంతోషించితిఁ జాలుఁ జాలు రతిరాజద్వార సౌఖ్యంబులన్

శాంతింబొందితిఁ జాలుఁ జాలు బహురాజద్వార సౌఖ్యంబులన్

శాంతింబొందెదఁ జూపు బ్రహ్మపదరాజద్వార సౌఖ్యంబు ని

శ్చింతన్ శాంతుఁడ నౌదు నీ కరుణచే శ్రీ కాళహస్తీశ్వరా! 61

 

Reference: శ్రీ కాళహస్తీశ్వర శతకము

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *