గువ్వలచెన్న శతకము
శతకము గురించి
క. శ్రీ పార్థసారధీ! నేఁ బాపాత్ముఁడ నీదు పాలఁ బడినాఁడ ననుం గాపాడు మనుచు నాంతర కోపాదు లడంచి వేడు గువ్వలచెన్నా! ।। 1 ।।
క. నరజన్మ మెత్తినందున సరసిజనాభు నెదలోన స్మరియించుచుఁ ద చ్చరణములు మఱవకుండిన గురుఫలమగు జన్మమునకు గువ్వలచెన్నా! ।। 2 ।।
క. ఎంతటి విద్యల నేర్చిన సంతసముగ వస్తుతతులు సంపాదింపన్ జింతించి చూడ నన్నియు గొంతుకఁ దడుపుకొను కొఱకె గువ్వలచెన్నా! ।। 3 ।।
క. సారాసారము లెఱుఁగని బేరజులకు బుద్ధిఁ జెప్పఁ బెద్దల వశమా నీరెంత పోసి పెంచినఁ గూరగునా నేల వేము గువ్వలచెన్నా! ।। 4 ।।
క. అడుగునకు మడుఁగు లిడుచును జిడిముడి పాటింత లేంక చెప్పిన పనులున్ వడిఁజేసి నంత మాత్రాన కొడుకగునా లంజకొడుగు గువ్వలచెన్నా! ।। 5 ।।
క. ఈవియ్యని పద పద్యము గోవా చదివించు కొనఁగఁ గుంభిని మీఁదన్ ఈవిచ్చిన పద పద్యము గోవా మఱిఁ జదువుకొనఁగ గువ్వలచెన్నా! ।। 6 ।।
క. ఇరుగు పొరుగువా రందఱుఁ గర మబ్బుర పడుచు నవ్వఁగా వేషములన్ మఱి మఱి మార్చిన దొరలకు గురువగునా బ్రాహ్మణుండు గువ్వలచెన్నా! ।। 7 ।।
క. అనుభవము లేని విభవము లను భావ్యయ కానీయాలు నార్యాను మతిన్ గనని స్వభావము ధర్మముఁ గొనని సిరియు వ్యర్థ మెన్న గువ్వలచెన్నా! ।। 8 ।।
క. పదుగురికి హితవు సంపత్ప్రదమును శాస్త్రోక్తమైన పద్ధతి నడువన్ జెదరదు సిరి హరిభక్తయుఁ గుదురునుగద మదిని నెన్న గువ్వలచెన్నా! ।। 9 ।।
క. వెలకాంత లెందఱైననుఁ గులకాంతకు సాటిరారు కువలయమందున్ బలువిద్య లెన్ని నేర్చినఁ గులవిద్యకు సాటిరావు గువ్వలచెన్నా! ।। 10 ।।
క. కలకొలఁది ధర్మముండినఁ గలిగిన సిరి కదలకుండుఁ గాసారమునన్ గలజలము మడువులేమిని గొలగొల గట్టు తెగిపోదె? గువ్వలచెన్నా! ।। 11 ।।
క. తెలిసియుఁ దెలియనివానికిఁ దెలుపంగలఁడే? మహోపదేశికుడైనన్ బలుకంబాఱనిగాయము గొలుపంగలఁడెవడు మడ? గువ్వలచెన్నా! ।। 12 ।।
క. చెలియలి భాగ్యము రాజ్యంబుల నేలుచు జనుల ద్వేషమునఁ జూచుచుఁ గ న్నుల మత్తతఁ గొన్నాతఁడు కొలనికి గాపున్న వాఁడు గువ్వలచెన్నా! ।। 13 ।।
క. అపరిమిత వాహనాదిక మపూర్వముగనున్న యల్పుఁడధికుండగునా? విపులాంబరవాద్యంబులఁ గుపతియగునె గంగిరెద్దు? గువ్వలచెన్నా! ।। 14 ।।
క. పందిరి మందిరమగునా? వందిజనంబాప్తమిత్రవర్గం బగునా? తుందిలుఁడు సుఖముఁగనునా? గొంది నృపతిమార్గమగున? గువ్వలచెన్నా! ।। 15 ।।
క. మిత్రుని విపత్తునందుఁ గళత్రమును దరిద్రదశను భ్రాతలగుణమున్ బాత్రాది విభక్తంబున గోత్రను గనుగొనఁగవలయు గువ్వలచెన్నా! ।। 16 ।।
క. అంగీలు పచ్చడంబులు సంగతిఁగొనుశాలుజోడు సరిగంచుల మేల్ రంగగు దుప్పటు లన్నియు గొంగళి సరిపోలవన్న! గువ్వలచెన్నా! ।। 17 ।।
క. స్వాంతప్రవృత్తిఁ గార్యా నంతరమున మిత్రలక్షణంబు మద్యోహో గాంతరమున బంధుత్వముఁ గొంతైనంతటన చూడు గువ్వలచెన్నా! ।। 18 ।।
క. పురుషుండు తటస్థించిన తరుణమునం దరుణిగుణముఁ దరుణిదనంతన్ దొరికినఁ బురుషుని గుణమును గురుబుద్ధీ! తెలియవలయు గువ్వలచెన్నా! ।। 19 ।।
క. కలిమిఁగల నాడె మనుజుఁడు విలసనమగు కీర్తిచేత వెలయఁగ వలెరా! గలిమెంత యెల్లకాలము కులగిరులా కదలకుండ? గువ్వలచెన్నా! ।। 20 ।।
క. బుడ్డకు వెండ్రుకలున్నన్ గడ్డము కానట్లు కార్యకరణుల సభలన్ దొడ్డుగఁ జూతురె? తలపై గుడ్డలు బుట్టంత లున్న? గువ్వలచెన్నా! ।। 21 ।।
క. వనజకులులును శూద్రులు ననియెడి భేదంబు లేక యందఱు నొకరీ తిని గొని యాచారాదుల గుణముల సరి నుందుమంద్రు గువ్వలచెన్నా! ।। 22 ।।
క. కలుఁద్రావి నంజుడుం దిను ఖలుసుతుఁడు వకీలె యైన ఘనమర్యాదల్ తెలియవు బ్రాహ్మణుఁడైనను కుపాంసనుఁ డనఁగఁదగును గువ్వలచెన్నా! ।। 23 ।।
క. వారిది వారిది ధనమొక కారణమున వచ్చిపడఁగఁ గన్నులుగన కె వ్వారినిఁ దిరస్కరించును గోరెఁడు ధర్మంబు లేక గువ్వలచెన్నా! ।। 24 ।।
క. ఇలుఁగలఁడె? పరివ్రాజకుఁ డెలమింగొనునెట్లు వేశ్య? యీనివిటునెడన్ గులగాంత విత్తమడుగునె? కొలఁదిఁ గలదె ఱంకులాడి గువ్వలచెన్నా! ।। 25 ।।
క. ధన మతిగఁ గల్గి యున్నను దనయులుఁ దనయులును గల్గి తనరుచునున్నన్ ఘనలోభియు నిఱుపేదయు గుణముల సరియగుదు రెన్న గువ్వలచెన్నా! ।। 26 ।।
క. చండాల కులుఁ డొసగిన తండులముల బ్రతికినట్టి ధాత్రీ శకులుల్ నిండుతనం బెఱుఁగుదురే? కొండికలఁ జరింత్రు గాక గువ్వలచెన్నా! ।। 27 ।।
క. సిరిఁగలిగినంత బంధూ త్కరములలో నెవరురారు ద్రవ్యాసూయా పరతాశాపరులయి పదుగురు చూచి హసింతు రంచు గువ్వలచెన్నా! ।। 28 ।।
క. సంపద గలిగిన మనుజుని కొంపకు బంధువులు కుప్పకుప్పలుగాఁగన్ సొంపుగ వత్తురు పేదకుఁ గుంపటు లన నుంద్రువారె గువ్వలచెన్నా! ।। 29 ।।
క. నీచునకు ధనము గల్గిన వాచాలత గల్గి పరుషవాక్కు లఱచుచున్ నీచ కృతి యగుచు మది సంకోచము లేకుండఁదిరుగు గువ్వలచెన్నా! ।। 30 ।।
క. అల్పునకు నెన్ని తెల్పినఁ బొల్పుగ నిల్వవవి పేడబొమ్మకు నెన్నో శిల్పపుఁ బనులొనరించినఁ గోల్పోక యలారుచున్నె గువ్వలచెన్నా! ।। 31 ।।
క. పిత్రాద్యైశ్వర్యముచేఁ బుత్రులుఁ బౌత్రులును ధర్మబుధ్ధిఁ జరింతుర్ చిత్రగతి నడుమఁ గల్గిన గోత్రంజిత్రగతిఁ దిరుగు గువ్వలచెన్నా! ।। 32 ।।
<
p>శతకములు
శ్రీ కాళహస్తీశ్వర శతకము | వేమన శతకము | సుమతీ శతకము | దాశరథీ శతకము | భాస్కర శతకము | భర్తృహరి శతకములు | నారాయణ శతకము | కృష్ణ శతకము | ఆంధ్ర నాయక శతకము | నరసింహ శతకము | రామలింగేశ శతకము | వృషాధిప శతకము | మారుతి శతకము | దేవకీనందన శతకము | గువ్వలచెన్న శతకము | కుమార శతకము | కుమారీ శతకము | వేంకటేశ శతకము | సూర్య శతకము | సర్వేశ్వర శతకము | శ్రీ (అలమేలుమంగా) వేంకటేశ్వర శతకము | ధూర్తమానవా శతకము | కుప్పుసామి శతకము | శతకము
"http://te.wikisource.org/wiki/%E0%B0%97%E0%B1%81%E0%B0%B5%E0%B1%8D%E0%B0%B5%E0%B0%B2%E0%B0%9A%E0%B1%86%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8_%E0%B0%B6%E0%B0%A4%E0%B0%95%E0%B0%AE%E0%B1%81" నుండి వెలికితీశారు
వ్యక్తిగత పనిముట్లు
నేంస్పేసులు
వైవిధ్యాలు
పేజీ లింకులు
చర్యలు
అన్వేషణ
మార్గదర్శకం
ముద్రించండి/ఎగుమతి చేయండి
పరికరాలపెట్టె
- ఈ పేజీకి 12:20, 9 డిసెంబరు 2008న చివరి మార్పు జరిగినది.
- పాఠ్యం క్రియేటివ్ కామన్స్ అట్రిబ్యూషన్/షేర్-అలైక్ లైసెన్సు క్రింద లభ్యం; అదనపు షరతులు వర్తించవచ్చు. మరిన్ని వివరాలకు వాడుక నియమాలను చూడండి.